: ఢిల్లీలో కొత్త రహదారి నిబంధనలు... ఉల్లంఘిస్తే రూ.2వేల జరిమానా
ఢిల్లీలో జనవరి 1 నుంచి అమలుకానున్న సరి-బేసి సంఖ్యల విధానానికి సంబంధించిన వివరాలను సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి తెలిపారు. మొదటి 15 రోజులు సరి, బేసి సంఖ్య నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఢిల్లీ వాసులను కోరారు. ఒకవేళ నియమావళిని ఉల్లంఘిస్తే రూ.2వేల జరిమానా విధిస్తామని మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. అయితే 12 సంవత్సరాల్లోపు పిల్లలతో ఉండి వాహనాలు డ్రైవ్ చేసే మహిళలు, సీఎన్ జీ కార్లు వాడేవాళ్లు, వీఐపీలు ఈ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ విధానం ఢిల్లీ సీఎం అయిన తనకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేశారు.
ఈ పదిహేను రోజుల ట్రయల్ రన్ లో భాగంగా రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, గవర్నర్లు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, లోక్ సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, సుప్రీంకోర్టు జడ్జీలు, డీప్యూటీ స్పీకర్, ఏవైనా అత్యవసర వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నట్టు కేజ్రీ ప్రకటించారు. ఈ జాబితాలో ద్విచక్ర వాహనాలు, రక్షణ శాఖ వాహనాలు, పైలట్ కార్లు, సీడీ నంబర్ ప్లేట్లు ఉండే ప్రత్యేక భద్రతా బలగాల వాహనాలకు కూడా సరి-బేసి ఫార్ములా వర్తించదని వివరించారు. ఈ 15 రోజులకు గానూ అవసరమైన ఎమర్జెన్సీ వాహనాలు, పీసీఆర్లు కూడా దాని పరిధిలోకి రావు. ఈ సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా న్యూఢిల్లీలో 6వేల బస్సులను అదనంగా నడపనున్నారు.