: కీర్తి ఆజాద్ పై సస్పెన్షన్ వేటు?... శీతాకాల సమావేశాల తర్వాత కత్తి ఝుళిపించనున్న బీజేపీ
ఓ వైపు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీకి కొరకరాని కొయ్యగా మారారు. తాజాగా ఆయనకు మద్దతుగా అన్నట్లు సొంత పార్టీ నేత, ఎంపీ కీర్తి ఆజాద్ కూడా పార్టీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీపై పరుష పదజాలంతో విరుచుకుపడుతున్నారు. డీడీసీఏ కుంభకోణంపై ఆది నుంచే అసంతృప్తితో ఉన్న ఆజాద్, తాజాగా గళం విప్పారు. దమ్ముంటే తనపైనా పరువు నష్టం దావా వేయాలంటూ ఆయన నిన్న జైట్లీకి సవాల్ విసిరారు.
సొంత పార్టీ నేతపైనే విమర్శలు గుప్పిస్తున్న ఆజాద్ పై చర్యలు తీసుకోకపోతే పరిస్థితి చేయి జారిపోక తప్పదని బీజేపీ అధినాయకత్వం దాదాపుగా నిర్ణయించింది. ఈ క్రమంలో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించడమొక్కటే మార్గమని కూడా భావిస్తోంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసిన మరుక్షణమే ఆజాద్ పై సస్పెన్షన్ వేటు వేసేందుకు దాదాపుగా రంగం సిద్ధమైందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.