: గుప్పుమన్న అజహరుద్దీన్ మూడో పెళ్లి వార్తలు... ఖండించిన టీమిండియా మాజీ కెప్టెన్
టీమిండియా మాజీ కెప్టెన్, హైదరాబాదీ మేటి క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్ పెళ్లిళ్ల విషయంలోనూ తనది ప్రత్యేక పంథా అని నిరూపించుకున్నాడు. 52 ఏళ్ల వయసులో అతడు ముచ్చటగా మూడో సారి పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. సదరు వార్తలను అజ్జూ భాయ్ ఖండిస్తున్నప్పటికీ, ఇటీవల వెలుగుచూసిన పలు ఘటనలు మాత్రం అది వాస్తవమేనని తేటతెల్లం చేస్తున్నాయి. టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించిన అతడు గతంలో నౌరీన్ అనే మహిళతో తొలి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లకే ఆ పెళ్లి పెటాకులు కాగా, బాలీవుడ్ అందాల నటి సంగీతా బిజిలానీతో రెండో పెళ్లి చేసుకున్నాడు. 1996లో జరిగిన ఈ పెళ్లి 2010లో విడాకులతో ముగిసింది.
ఆ తర్వాత 2012లో తనకు పరిచయమైన అమెరికా దేశస్థురాలు, ఫ్యాషన్ డిజైనర్ షనోన్ మేరీని అతడు ఇటీవలే వివాహం చేసుకున్నట్లు సమాచారం. 2013లో ప్యారిస్ లో వీరిద్దరూ సెలవులను ఎంజాయ్ చేశారన్న వార్తలు వినిపించాయి. మొన్నటికి మొన్న ఐటీపీఎల్ సిరీస్ లో భాగంగా టెన్నిస్ మ్యాచ్ ను వీక్షించేందుకు స్టేడియానికి వచ్చిన అజ్జూ భాయ్ వెంట మేరీ కూడా వుంది. ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని మరీ మ్యాచ్ ను ఎంజాయ్ చేశారు.
తాజాగా ఇటీవలే చనిపోయిన తన కారు డ్రైవర్ జాన్ మహ్మద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన అజ్జూ భాయ్, మేరీని వెంటబెట్టుకుని వెళ్లాడు. అక్కడి వారికి ఆమెను తన భార్యగా పరిచయం చేశాడట. అయితే ఈ వార్తలను మాత్రం అజ్జూ భాయ్ ఖండించాడు. ‘‘నేను మూడో పెళ్లి చేసుకున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. పత్రికల్లో రాసే ముందు నిజానిజాలు తెలుసుకోవాలి’’ అని అతడు ట్వీట్ చేశాడు.