: సినీ పరిశ్రమకు షాక్...ప్రముఖ సినీ నటుడు రంగనాథ్ ఆత్మహత్య
టాలీవుడ్ కు షాక్ తగిలింది. ప్రముఖ సినీ నటుడు రంగనాథ్ (66) ఆత్మహత్య చేసుకున్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని రంగనాథ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది. వ్యక్తిగా ఎంతో సౌమ్యుడు, స్నేహశీలి, ఆదర్శవాది అయిన రంగనాథ్ ఇలా మరణించడం అందరినీ కలచివేస్తోంది. ఎంతో మానసిక స్థైర్యం కలిగిన రంగనాథ్ ఆత్మహత్యకు పాల్పడడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా, 1949లో మద్రాస్ లో ఆయన జన్మించారు. ఆయన పూర్తి పేరు తిరుమల సుందర శ్రీరంగనాథ్. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తి చేసిన రంగనాథ్, కొంత కాలం రైల్వే శాఖలో టీసీగా పని చేశారు. అనంతరం 1969లో సినీ రంగంలో ప్రవేశించారు. 1974లో 'చందన' సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన రంగనాథ్ సుమారు 300 కు పైగా సినిమాల్లో నటించారు. పలు సినిమాల్లో హీరోగా నటించిన రంగనాథ్, తరువాతి కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి, విభిన్నమైన కీలక పాత్రలు పోషించారు. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.