: సభను ధిక్కరించడం అవుతుందన్న స్పీకర్... బయటకు వెళ్లిపోయిన రోజా
ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వైకాపా ఎమ్మెల్యే రోజాపై అసెంబ్లీ నుంచి ఒక ఏడాది పాటు సస్పెన్షన్ వేటు పడింది. వెంటనే సభ నుంచి వెళ్లి పోవాలని స్పీకర్ కోడెల రోజాను ఆదేశించారు. అయినప్పటికీ, రోజా సభ నుంచి బయటకు వెళ్లకుండా, సభలోనే ఉండిపోయారు. మరోవైపు, రోజాపై సస్పెన్షన్ ను వెనక్కి తీసుకోవాలంటూ వైకాపా సభ్యులు స్పీకర్ ను కోరారు. దీనిపై స్పందించిన స్పీకర్... తీర్పు ఇవ్వడం అయిపోయిందని, సభ నుంచి రోజా వెళ్లి పోవాల్సిందే అని అన్నారు. ఏదైనా మాట్లాడదలుచుకుంటే సభలో కాకుండా... బయట మాట్లాడుకోవాలని సూచించారు. వెంటనే బయటకు వెళ్లిపోవాలని అన్నారు. సభను వదిలి వెళ్లకపోతే, అది సభను ధిక్కరించడం అవుతుందని హెచ్చరించారు. ఈ క్రమంలో, ఆమె బయటకు వెళ్లిపోయారు.