: మోదీ 'గ్రోత్ డ్రీమ్' నెరవేరకుండా అడ్డుపడుతున్నవి ఇవే!

గత సంవత్సరం అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, భారత వృద్ధి రేటును మరో మెట్టెక్కించాలన్న కల ఈ సంవత్సరం నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. కనీసం 8 శాతానికి పైగా ఇండియా జీడీపీ నమోదవుతుందని ఇంతవరకూ భావిస్తూ రాగా, ఆ స్థాయి వృద్ధి సాధ్యం కాదని ఆర్థిక శాఖ ఓ నివేదికను వెలువరించింది. పలు ప్రాంతాల్లో అనావృష్టి, అతివృష్టి కారణంగా ఈ సంవత్సరం వ్యవసాయ ఉత్పత్తి మందగించడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. నిత్యావసర వస్తువులు, కొన్ని రకాల కూరగాయల ధరలు ఆకాశానికి చేరడం, ద్రవ్య లోటు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు వృద్ధి అంచనాలను తగ్గించాయని మధ్యంతర ఆర్థిక నివేదిక స్పష్టం చేసింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను విక్రయించడం ద్వారా ముందుగా ఊహించినంత ఆదాయం రాకపోవడం, ఇండియా నుంచి ఎగుమతులు తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిస్థితులు కూడా మోదీ సర్కారు గ్రోత్ డ్రీమ్ కు అడ్డు పడ్డాయని నిపుణులు వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థ రికవరీ దిశగా పయనిస్తున్నప్పటికీ, అందుకు బలమైన సంకేతాలు కనిపించడం లేదని, అందువల్లే జీడీపీ గణాంకాల్లో సైతం అనిశ్చితి ఏర్పడిందని పేర్కొన్నారు. కాగా, 2015-16 వృద్ధి రేటు 7 నుంచి 7.5 శాతం మధ్య ఉంటుందని నేడు పార్లమెంటు ముందుకు వచ్చిన ఆర్థిక నివేదిక వెల్లడించిన సంగతి తెలిసిందే.

More Telugu News