: చైనాను పూర్తిగా వదిలేయనున్న మైక్రోమ్యాక్స్
భారత్ కేంద్రంగా పనిచేస్తూ, చైనాలో స్మార్ట్ ఫోన్లను తయారు చేయించి, దేశవ్యాప్తంగా విక్రయిస్తున్న మైక్రోమ్యాక్స్ ఆ దేశాన్ని పూర్తిగా విడిచి పెట్టాలని భావిస్తోంది. 2018 నాటికి చైనాను పూర్తిగా విడిచి పెట్టి, స్మార్ట్ ఫోన్ల తయారీ కార్యకలాపాలన్నీ ఇండియా నుంచే చేపట్టనున్నట్టు సంస్థ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ వివరించారు. ప్రస్తుతం మూడింట రెండు స్మార్ట్ ఫోన్లు ఇండియాలోనే తయారు చేస్తున్నామని, భవిష్యత్తులో అన్ని ఫోన్లూ ఇక్కడే తయారవుతాయని అన్నారు. చైనాలో లేబర్ ఖర్చులు పెరుగుతుండటం, ఇండియాలో సెల్ ఫోన్ విడి పరికరాలను తయారు చేస్తున్న సంస్థల సంఖ్య పెరగడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. చైనాతో పోలిస్తే ఇండియాలో మానవ శక్తి మరింత తక్కువ ధరకు లభిస్తోందని ఆయన అన్నారు. 2008లో లోకాస్ట్ స్మార్ట్ ఫోన్ సంస్థగా ప్రవేశించిన సంస్థ ఇప్పటికే రూ. 300 కోట్ల పెట్టుబడులతో సెల్ ఫోన్ మాన్యుఫాక్చరింగ్ సెంటర్ లను అభివృద్ధి చేసింది.