: టీచర్లు ఇక తుపాకులు తెచ్చుకోవచ్చు... అమెరికాలోని ఓ పాఠశాల అనుమతి

ఇటీవలి కాలంలో అమెరికాలోని పలు పాఠశాలల్లో కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ పాఠశాల యాజమాన్యం స్వీయ రక్షణ చర్యలు చేపట్టింది. తమ టీచర్లు తమతో బాటు తుపాకులు తెచ్చుకునేందుకు అనుమతి తెలిపింది. టెక్సాస్ లోని జాన్సన్ కౌంటీ పరిధిలో ఉన్న 'కీనీ ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్' ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. మొదట్లో టీచర్లు తుపాకులు తీసుకెళ్లడానికి వ్యతిరేకించిన పాఠశాల సూపరింటెండెంట్ రికీ స్టీఫెన్స్ ఇప్పుడు మనసు మార్చుకున్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దుర్ఘటనల సమయంలో ఇతర విద్యార్థులను కాపాడటానికి, టీచర్ల ఆత్మరక్షణకు ఉద్దేశించిన తాజా నిర్ణయాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి నెల నుంచి అమలు చేస్తామని తెలిపారు. అయితే తుపాకులు తీసుకెళ్లడానికి ఏ టీచర్లు అర్హులో పాఠశాల ముందుగా ఎంపిక చేయనుంది. ఇదే పాఠశాలకు ఉన్న మరో నాలుగు క్యాంపస్ లలోనూ ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని భావిస్తోంది.

More Telugu News