: బల ప్రదర్శన!... ఎంపీలు, సీఎంలతో కలిసి కోర్టుకు సోనియా, రాహుల్?
నేషనల్ హెరాల్డ్ కేసు విచారణకు రేపు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీలోని పాటియాలా కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఈ విషయంలో వెనకడుగు వేయకుండా ముందుకే సాగాలని కాంగ్రెస్ పార్టీ దాదాపుగా నిర్ణయించుకుంది. అవసరమైతే జైలుకు వెళ్లేందుకు కూడా వారిద్దరూ మానసికంగా సిద్ధపడ్డట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని సోనియా, రాహుల్ లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారని మొన్నటిదాకా ప్రచారం సాగింది.
అయితే సుప్రీంకోర్టులో అలాంటి పిటిషన్ ఏదీ దాఖలు కాని నేపథ్యంలో కోర్టుకు హాజరయ్యేందుకే వారు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తద్వారా కోర్టులోనే నరేంద్ర మోదీ సర్కారుపై పోరు సాగించేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుందని నేషనల్ మీడియాలో పలు ప్రత్యేక కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ క్రమంలో రేపటి విచారణకు కోర్టుకు బయలుదేరనున్న సోనియా, రాహుల్ గాంధీల వెంట ఆ పార్టీ ఎంపీలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు ర్యాలీగా వెళతారట. ఈ మేరకు ఎంపీలు, సీఎంలతో పాటు అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్ లకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లిపోయాయని సమాచారం. అంటే, రేపు కోర్టుకు వెళ్లనున్న సోనియా, రాహుల్ గాంధీలు తమ సత్తా ఏమిటో చూపనున్నారన్నమాట.