: లోక్ సభలో సల్మాన్ కేసు తీర్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు
'హిట్ అండ్ రన్' కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను నిర్దోషిగా బాంబే హైకోర్టు నిర్ధారించిన సంగతి తెలిసిందే. 2002లో జరిగిన కారు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తికి అసలు బాధ్యులెవరన్న దానిపై పలువురి నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఇదే విషయంపై లోక్ సభలో చిన్నపాటి చర్చ జరిగింది. కమర్షియల్ కోర్టుల బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా సల్మాన్ కేసు తీర్పు అంశం చర్చకు వచ్చింది. ఎన్డీయే సభ్యులు వినాయక్ రావత్ (శివసేన), కీర్తీ ఆజాద్ (బీజేపీ)లు ఈ అంశాన్ని లేవనెత్తారు. 'ఈ కేసులో సల్మాన్ నిర్దోషిగా తేలితే అప్పుడు కారును జింక డ్రైవ్ చేస్తూ ఉండొచ్చు' అని ఆజాద్ వ్యంగ్యంగా అన్నారు. అంటే ఇక్కడ రాజస్థాన్ లో సల్మాన్ పై నమోదైన జింకల వేట కేసును పరోక్షంగా ప్రస్తావించారనుకోవచ్చు.
ఆ వెంటనే శివసేన సభ్యుడు వినాయక్ రావత్ మాట్లాడుతూ, "ఇదీ మన న్యాయ వ్యవస్థ పని చేస్తున్న తీరు. 12 ఏళ్ల తరువాత సల్మాన్ నిర్దోషిగా విడుదలయ్యారు. మరి ఆ రోజు, ఆ ప్రమాదం జరిగి ఒకరు చనిపోవడానికి ఎవరు బాధ్యులు? ఆ ప్రమాదం ఎవరు చేశారు? ఆ పేదవాడి మరణానికి కారకులను గుర్తించేందుకు ఎవరూ విచారణ జరపలేదెందుకు? ఆ మరణాన్ని జవాబు లేని ప్రశ్నగా మిగల్చడం ఒక వ్యవస్థ చేయాల్సిన పనేనా? ఒకరికి న్యాయం చేసిన న్యాయ వ్యవస్థకు, నాడు ఆ అన్యాయం చేసింది ఎవరో కనుగొనాల్సిన బాధ్యత లేదా?" అని ప్రశ్నించారు.
ఆ వెంటనే... 'చట్టం తెలిసిన వాడు మంచి లాయర్, జడ్జి తెలిసిన వాడు గొప్ప లాయర్' అని ఆజాద్ అన్నారు. మరి జింకను చంపినవాడు జైలుకు వెళితే మనిషిని చంపిన వాడు నిర్దోషిగా విడుదలవుతున్నాడని, ఇదీ మన న్యాయవ్యవస్థ పని చేస్తున్న తీరు అని ధ్వజమెత్తారు.