: తిరుమలపై ‘ఉగ్ర’ గురి!... రెక్కీ కూడా పూర్తయిందట!
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలపై ఉగ్రవాదులు విరుచుకుపడేందుకు పక్కా ప్లాన్ వేశారా? అంటే, అవుననే అంటున్నాయి పోలీసు, నిఘా వర్గాలు. పక్కా ప్రణాళికలో భాగంగా ఆలయంపై ఉగ్రవాదులు ఇప్పటికే రెక్కీ కూడా పూర్తి చేశారట. ఇక దాడులే తరువాయి అన్న సమయంలో రెక్కీ నిర్వహించిన ముష్కరుడు ఒడిశా పోలీసులకు పట్టుబడటంతో తిరుమలపై ఉగ్రవాదుల కుట్ర వెలుగు చూసింది. వివరాల్లోకెళితే... తమిళనాడులోని తిరునల్వేలికి చెందిన సుభాష్ రామచంద్రన్ చెన్నై సహా పలు నగరాల్లో హోటల్ లో కార్మికుడిగా పనిచేశాడు. ఈ క్రమంలో ముంబైలో పనిచేస్తున్నప్పుడు రియాజ్ అనే వ్యక్తితో అతడికి పరిచయం ఏర్పడింది.
ముంబైలో ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డ రామచంద్రన్ డబ్బు అవసరాన్ని తీర్చుకునేందుకు రియాజ్ వేసిన ఉగ్ర పథకంలో పాలు పంచుకునేందుకు ఒప్పుకున్నాడు. రియాజ్ తో పాటు మరికొంత మందితో కలిసి రైళ్లకు నిప్పు పెట్టే రసాయనాలను తయారు చేశారు. వీటిని పరిశీలించే క్రమంలో ఇటీవల పూరీ రైల్వే స్టేషన్ లో రామచంద్రన్ తన ప్రయోగాన్ని అమలు చేశాడు. ఆ సమయంలో అక్కడి సీసీ కెమెరాకు చిక్కిన అతడిని పోలీసులు ఆ తర్వాత అరెస్ట్ చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా దర్యాప్తు బాధ్యతలను ఒడిశా పోలీసులు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించారు.
రామచంద్రన్ ను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు అతడిని అన్ని కోణాల్లో విచారించగా, తిరుమలపై దాడికి పన్నాగం వెలుగుచూసింది. తిరుమలపై రెక్కీతో పాటు రసాయనాల ప్రయోగం కోసం అతడికి ఉగ్రవాదులు రూ.3 లక్షలు కూడా అందజేశారట. కాశ్మీర్ నుంచి ఉగ్రవాదులు సదరు మొత్తాన్ని అతడి బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఇక తిరుమలపై రెక్కీకి సంబందించి అతడు చెబుతున్న మాటలను తొలుత అనుమానించిన ఎన్ఐఏ అధికారులు తిరుమలలోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత ఎన్ఐఏ అధికారుల హెచ్చరికలతో ఏపీ పోలీసులు తిరుమల వద్ద కట్టుదిట్టమైన భద్రతతో పాటు నిఘాను మరింత పెంచారు.