: విద్యుత్ వైర్లు తగిలి ఏనుగు మృతి... చుట్టూ చేరి గజరాజుల ఘీంకారం

చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గ పరిధిలోని రామకుప్పం సమీపంలో గజరాజుల ఘీంకారాలు మారుమోగుతున్నాయి. దీంతో సదరు మండల కేంద్రంలోని ప్రజలు భీతావహులవుతున్నారు. గ్రామ సమీపంలోని పొలాల వద్దకు వచ్చిన ఓ ఏనుగు విద్యుత్ వైర్లు తగిలి కరెంట్ షాక్ కు గురైంది. దాంతో అక్కడికక్కడే కిందపడి చనిపోయింది. విషయాన్ని గమనించిన ఏనుగుల మంద క్షణాల్లో చనిపోయిన ఏనుగు మృతదేహం చుట్టూ చేరిపోయాయి. సహచర గజరాజు మృతి ఆ ఏనుగుల గుంపును తీవ్ర ఆవేదనలోకి నెట్టేసింది. దీంతో పెద్ద పెట్టున ఘీంకారం చేస్తూ చనిపోయిన ఏనుగు చుట్టూ రౌండ్లు కొడుతున్నాయి. దీంతో ఎక్కడ తమ గ్రామంపై ఏనుగులు విరుచుకుపడతాయోనన్న భయాందోళనలో రామకుప్పం వాసులు బెంబేలెత్తిపోతున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని ఏనుగుల మందను అడవుల్లోకి పంపేందుకు యత్నించారు. అయితే అప్పటికే సహచర ఏనుగు చనిపోయి ఆవేదనలో ఉన్న గజరాజులు అటవీ శాఖ సిబ్బందిపై ఎదురు దాడికి దిగాయి. దీంతో అటవీ శాఖ సిబ్బంది చెల్లాచెదురయ్యారు.

More Telugu News