: ఇది షేన్ వార్న్ కలల టీమిండియా జట్టు
ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ప్రపంచ క్రికెట్ ను సంస్కరించేందుకు కంకణం కట్టుకున్నట్టు కనపడుతోంది. క్రికెట్ పై ఉన్న అభిమానం కోల్పోకుండా ఉండేందుకు పలు దేశాల క్రికెట్ బోర్డులకు కీలక సూచనలు చేస్తున్న షేన్ వార్న్, తన కలల జట్లను కూడా ప్రకటిస్తున్నాడు. తాజాగా, టీమిండియా జట్టును కూడా ప్రకటించాడు. టీమిండియా ఆల్ టైమ్ గ్రేట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీని కెప్టెన్ గా ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా వీరేంద్ర సెహ్వాగ్, నవ్ జోత్ సింగ్ సిద్దూను ఎంపిక చేశాడు. ఫస్ట్ డౌన్ కు గ్రేట్ వాల్ రాహుల్ ద్రవిడ్ ను ఎంపిక చేసుకున్నాడు. సెకెండ్ డౌన్ కు ఎప్పట్లానే సచిన్ టెండూల్కర్ ను ఎంపిక చేశాడు. తరువాతి స్థానంలో కెప్టెన్ సౌరవ్ గంగూలీని బ్యాటింగ్ కు ఎంపిక చసుకున్న షేన్ వార్న్ కు తరువాత స్థానంలోనే ఎవరిని ఎంపిక చేసుకోవాలో అర్ధంకాక ఆలోచనలో పడ్డాడట.
కారణం ఆ స్థానం కోసం అద్భుతంగా ఆడే హైదరాబాదీలు, టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్ పోటీ పడ్డారు. ఇద్దరూ దిగ్గజాలే, ఇద్దరూ అద్భుతమైన ఆటగాళ్లే, దీంతో ఎవరిని ఎంచుకోవాలో తేల్చుకోలేక, వారిద్దరినీ జట్టులోకి ఎంపిక చేసిన వార్న్, ఆ స్థానం అజ్జూకి కేటాయించి, లక్ష్మణ్ ను ఎక్సట్రా ప్లెయర్ గా తీసుకున్నాడు. కీపర్ స్ధానానికి ధోనీని, పేస్ బౌలింగ్ బాధ్యతను కపిల్ దేవ్, జవగళ్ శ్రీనాథ్ కు అప్పగించి, స్పిన్ బౌలింగ్ అనిల్ కుంబ్లీ, హర్భజన్ సింగ్ కు ఇచ్చాడు. దీంతో 12 మందితో కూడిన జట్టును తయారు చేశాడు. తాను తన కెరీర్ మొదట్లో దిలీప్ వెంగ్ సర్కార్, రవిశాస్త్రి, సంజయ్ మంజ్రేకర్, మనోజ్ ప్రభాకర్ వంటి దిగ్గజాలతో ఆడినా, తరువాత జహీర్ ఖాన్, గంభీర్ వంటి వారితో కూడా ఆడానని, దీంతో జట్టు ఎంపిక చాలా క్లిష్టంగా మారిందని వార్న్ పేర్కొన్నాడు. తన కెరీర్ లో ధోనీని ఎదుర్కోకపోయినా, ఐపీఎల్ లో ఆడిన కారణంగా అతనికి జట్టులో స్థానం కల్పించడం విశేషం.