: ఏపీ అసెంబ్లీ సమావేశాలు: అధికారపక్షంపై ముప్పేట దాడికి వైకాపా సర్వ సన్నద్ధం
రేపు ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరగనున్నాయి. అధికార టీడీపీపై విరుచుకుపడటానికి ప్రతిపక్ష పార్టీ వైకాపాకు కావాల్సినన్ని అస్త్రశస్త్రాలు ఉన్నాయి. అధికారపక్షంపై ముప్పేట దాడి చేయడానికి వైకాపా నేతలు సర్వసన్నద్ధులయ్యారు. ఈ రోజు హైదరాబాదులోని లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ సీఎల్పీ సమావేశం జరిగింది. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలతో పాటు, వ్యూహాత్మకంగా అధికారపక్షాన్ని ఎలా ఇరుకున పెట్టాలి? అనే అంశాలపై ఈ భేటీలో లోతుగా చర్చించారు.
సమావేశం అనంతరం వైకాపా నేతలు జ్యోతుల నెహ్రూ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు మీడియాతో మాట్లాడుతూ, కాల్ మనీపై సభను స్తంభింపజేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతున్న కల్తీ మద్యం అమ్మకాలు, దీనివల్ల అమాయకులు చనిపోయిన ఘటనపై చర్చిస్తామని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, గిరిజనుల ఉనికినే ప్రశ్నార్థకం చేసే బాక్సైట్ విధానాన్ని మార్చాలని, సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం డిమాండ్ చేస్తామని తెలిపారు. అంగన్ వాడీ, ఆశా వర్కర్ల సమస్యలను లేవనెత్తుతామని చెప్పారు. శాసనమండలిలో కూడా ఈ అంశాలను లేవనెత్తుతామని తెలిపారు. మరోవైపు, ప్రజా సమస్యలన్నింటినీ పూర్తిగా చర్చించేంత వరకు అసెంబ్లీ సమావేశాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు.