: ఇక రాహుల్ ఓదార్పు!... షకూర్ బస్తీని సందర్శించిన రాహుల్

తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర, పరామర్శ యాత్రలు మనం చూశాం. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా జగన్ బాటలోనే ఓదార్పు యాత్రలు చేస్తున్నారు. దేశంలో ఎక్కడ ఏది జరిగినా మొన్నటిదాకా అంటీ ముట్టనట్టు వ్యవహరించిన రాహుల్ గాంధీ ఇటీవల మాత్రం ఒక్క క్షణం కూడా నిలవలేకపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రైతు ఆత్మహత్యలపై చలించిన రాహుల్ రెండు రాష్ట్రాల్లో పాదయాత్రలు చేపట్టారు. ఈ యాత్రలకు మంచి స్పందన రావడంతో ఈ తరహాలో మరిన్ని యాత్రలు చేస్తున్నారు. తాజాగా నిన్న రైల్వే అధికారులు ఢిల్లీ నగరంలోని షకూర్ బస్తీలో పేదల గుడిసెలను తొలగించారు. ఈ సందర్భంగా ఓ బాలుడు మృత్యువాతపడ్డాడు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ ఘటనపై వేగంగా స్పందించిన రాహుల్ గాంధీ కొద్దిసేపటి క్రితం షకూర్ బస్తీకి వెళ్లిపోయారు. అక్కడి నిరాశ్రయులతో మాట కలిపారు. అండగా ఉంటానని ప్రకటించిన వారిని ఓదార్చారు. పేదల పట్ల రైల్వే అధికారులు నిర్దయగా వ్యవహరించారని ఆయన మండిపడ్డారు. ఈ ఘటనకు ఢిల్లీ సర్కారు నిర్లక్ష్యమే కారణమని కూడా ఆయన అరవింద్ కేజ్రీవాల్ సర్కారుపై నిప్పులు చెరిగారు.

More Telugu News