: రేపు విజయవాడకు తెలంగాణ సీఎం కేసీఆర్!
కేసీఆర్ తన ఫాంహౌస్ లో తలపెట్టిన అయుత చండీయాగానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని ఆహ్వానించేందుకు రేపు విజయవాడకు వెళ్లనున్నారు. రేపు ఉదయం ప్రత్యేక విమానంలో బయలుదేరే ఆయన, విజయవాడలోని చంద్రబాబు నివాసానికి వెళ్లి అయుత చండీయాగం ఆహ్వాన పత్రికను స్వయంగా అందజేయనున్నట్టు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.
వాస్తవానికి గత వారంలో చంద్రబాబు హైదరాబాద్ లో ఉన్న సమయంలో కేసీఆర్ ఆహ్వానించేందుకు వెళ్తారన్న వార్తలు వెలువడ్డాయి. అయితే, బాబు స్థిర నివాసంగా అమరావతి మారుతున్నందున అక్కడికే వెళ్లి పిలవాలని భావించిన కేసీఆర్ విజయవాడ వెళ్లేందుకే నిర్ణయించుకున్నారు. ఇక ఈ యాగానికి పిలిచినా, చంద్రబాబు వెళ్లరాదని తెలుగుదేశంలోని ఓ వర్గం ఒత్తిడి తెస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ టీడీపీ నేతలను ప్రలోభాలకు గురి చేసిందని, తమ వారిని అక్రమంగా పార్టీలోకి చేర్చుకుంటున్న వేళ, యాగానికి వస్తే, కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని వారు అంటున్నారు. ఇక చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారో మరో రెండు వారాల్లో తెలుస్తుంది.