: ఉక్రెయిన్ పార్లమెంటులో బిగ్ ఫైట్... ప్రధానిని ఎత్తి కుదేసిన విపక్ష ఎంపీ
మన చట్ట సభల్లో అసహనంతో ఊగిపోయే ప్రజా ప్రతినిధులు తమ ప్రత్యర్థులను పరుష పదజాలంతో దూషించడం, స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టడం, మహా అయితే మైకులు విరగ్గొట్టడమే మనకు తెలుసు. ఏపీ పునర్విభజన బిల్లు సందర్భంగా పెప్పర్ స్ప్రే చల్లి విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కొత్త తరహా ఆందోళనకు తెర తీశారు. ఇక జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఓ సభ్యుడిపై ఆయన ప్రత్యర్థి పార్టీ సభ్యులు సభలోనే దాడికి దిగారు. అయితే ఎక్కడా కూడా సీఎం కానీ, ప్రధాన మంత్రిపై కాని ప్రత్యక్షంగా దాడి చేసిన సందర్భాలను మనం చూడలేదు. ఉక్రెయిన్ పార్లమెంటులో ఈ తరహా అరుదైన ఘటన నిన్నటి పార్లమెంటు సమావేశాల్లో చోటుచేసుకుంది.
ఓ కీలక బిల్లుకు సంబంధించిన కీలక ప్రసంగం చేసేందుకు సిద్ధపడ్డ ప్రధాని అర్సెనీ యాత్సెన్యూక్ ను విపక్ష సభ్యుడు ఒలేహ్ బర్నా ఎత్తి కుదేశారు. ప్రధానిని అభినందించేందుకంటూ పూల బొకేతో వచ్చిన బర్నా ఒక్కసారిగా ప్రధానిపై దాడి చేశారు. పుష్పగుచ్ఛం ప్రధాని చేతిలో పెట్టి, ఆయనను ఎత్తి కుదేశారు. రెప్పపాటులో జరిగిన ఈ ఘటనతో తేరుకున్న అధికార పార్టీ పీపుల్స్ ఫ్రంట్ పార్టీ ఎంపీలు పరుగు పరుగున అక్కడికి చేరుకుని ప్రధానికి రక్షణగా నిలిచారు. ఆ తర్వాత బర్నాపై మూకుమ్మడి దాడికి దిగారు. దీంతో సభలో యుద్ధవాతావరణం నెలకొంది. యూరప్ కూటమికి అనుకూలంగా ప్రభుత్వం ప్రతిపాదించిన ఓ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతున్న సందర్భంగా ఈ గొడవ జరిగింది. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విపక్షం, బిల్లును అడ్డుకునేందుకు ఎంతదాకానైనా వెళ్లి తీరాలన్న నిర్ణయం నేపథ్యంలో బర్నా ఇలా రెచ్చిపోయారు. ఊహించని పరిణామానికి చేతిలోని పేపర్లు, పూలబొకే కింద పడిపోగా ప్రధాని నిశ్చేష్టులయ్యారు.