: కాశ్మీర్ లో మోదీపై దాడికి కుట్ర?... పర్యటనకు రెండు రోజుల ముందే ఐఎస్ఐకి చేరిన మ్యాప్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై దాడికి కుట్ర జరిగిందా? అంటే, అవుననే అంటున్నాయి నిఘా వర్గాలు. గతేడాది డిసెంబర్ 8న నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్ లోని బదామీ బాగ్ ను సందర్శించారు. ఈ పర్యటనకు రెండు రోజుల ముందుగా అంటే, డిసెంబర్ 6ననే సదరు ప్రాంతానికి సంబంధించిన మ్యాప్ పాకిస్థాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)కి చేరిపోయిందట. అయితే ప్రధాని పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత నేపథ్యంలో దాడికి ఉగ్రవాదులు వెనకడుగు వేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఖఫైతుల్లా ఖాన్ ఐఎస్ఐ ఏజెంట్ గా పనిచేస్తున్నాడన్న ఆరోపణలతో ఇటీవల అరెస్టైన సంగతి తెలిసిందే. అతడిని విచారించిన సందర్భంగా ఈ విస్తుగొలిపే వాస్తవం వెలుగు చూసింది. దీంతో ఖఫైతుల్లా ఖాన్ నుంచి మరింత సమాచారం సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.