: షీనాను హత్య చేసిన మరుసటి రోజు రెండో భర్తతో పార్టీ చేసుకున్న ఇంద్రాణి
తవ్వేకొద్దీ కొత్తకొత్త విషయాలు వెలుగులోకి వస్తున్న హై ప్రొఫైల్ కార్పొరేట్ మర్డర్, షీనా బోరా హత్య కేసులో విచారణ జరుపుతున్న సీబీఐ మరో విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. షీనాను హత్య చేసిన మరుసటి రోజు తన రెండో భర్త సంజీవ్ ఖన్నాతో కలసి ఇంద్రాణి 'కోల్ కతా క్రికెట్ అండ్ ఫుట్ బాల్ క్లబ్'లో పార్టీ చేసుకుందట. ఈ విషయాన్ని సంజీవ్ చిరకాల మిత్రుడు మంగలేష్ జలన్ సీబీఐకి వెల్లడించారు. రాయ్ గడ్ లో షీనా మృతదేహాన్ని పాతిపెట్టిన తరువాత ఇద్దరూ కోల్ కతాకు వచ్చారని, ఏప్రిల్ 25, 2012 రాత్రి, వీరిద్దరినీ క్లబ్ లో చూశానని, ఆ సమయంలో సంజీవ్ ఖన్నా ఓల్డ్ మంక్ రమ్ము తాగాడని, ఇంద్రాణి బీర్ తీసుకుందని తెలిపారు. ఆపై పీటర్ ముఖర్జియాను పికప్ చేసుకునేందుకు ఏప్రిల్ 27న ఆమె ముంబై వెళ్లిపోయిందని సీబీఐ అధికారులకు జలన్ చెప్పారు. 1987, 88 నుంచి తాను క్లబ్ సభ్యుడినని, తాను సంజీవ్ ఖన్నాకు స్నేహితుడినని, ఇంద్రాణితో ఎన్నడూ మాట్లాడలేదని తానిచ్చిన లిఖితపూర్వక స్టేట్ మెంట్ లో జలన్ తెలిపారు. సంజీవ్ కు, తనకు పుట్టిన విధి భవిష్యత్ కు షీనా అడ్డురావచ్చన్న ఆలోచనతోనే ఆమె హత్యకు కుట్ర చేశారని సీబీఐ వర్గాలు అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది.