: ఐఎస్ఐ కుట్ర భగ్నం... బీఎస్ఎఫ్ జవాను సహా ఐదుగురి అరెస్ట్
పాకిస్థాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) భారత భూభాగంపై జరపనున్న భారీ విధ్వంసానికి సంబంధించిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. భారత్-పాక్ సరిహద్దుల్లో దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న జవానును తన ఏజెంట్ గా నియమించుకున్న ఐఎస్ఐ భారత భూభాగంలోకి పెద్ద ఎత్తున ఉగ్రవాదులను పంపేందుకు పెద్ద పన్నాగమే పన్నింది. ఈ క్రమంలో ఇటీవలి కాలంలో సరిహద్దు వెంట నిత్యం కాల్పులు చోటుచేసుకుంటున్నాయి. దీనిపై విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెనువెంటనే రంగంలోకి దిగిపోయారు.
బీఎస్ఎఫ్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న అబ్దుల్ రషీద్ తో పాటు ఐఎస్ఐ ప్రతినిధిగా భావిస్తున్న కఫైతుల్లా ఖాన్ అలియాస్ మాస్టర్ రాజాను జమ్మూ కాశ్మీర్ లో అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాను జల్లెడ పట్టిన పోలీసులు ఐఎస్ఐ ఏజెంట్లుగా భావిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దాదాపుగా ఈ అరెస్టులన్నీ నిన్న ఏకకాలంలో జరిగాయి. ఒకేసారి ఐదుగురు ఐఎస్ఐ ఏజెంట్లు దేశంలో పట్టుబడటం కలకలం రేపుతోంది. అంతేకాక ఏకంగా బీఎస్ఎఫ్ లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ను తమవైపు తిప్పుకోవడంలో ఐఎస్ఐ సఫలమైన తీరుపై భద్రతా బలగాలు షాక్ కు గురయ్యాయి. సరిహద్దు వెంట భారత బలగాల మోహరింపునకు సంబంధించి కీలక సమాచారాన్ని అబ్దుల్ రషీద్ ఐఎస్ఐకి చేరవేసినట్లు తెలుస్తోంది.