: లొంగుబాటలో చింటూ రాయల్... పత్రికా కార్యాలయానికి లేఖ రాసిన వైనం
చిత్తూరు నగర మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త మోహన్ ల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ రాయల్ అలియాస్ చంద్రశేఖర్ లొంగుబాట పట్టాడు. పట్టపగలు, నగరం నడిబొడ్డున్న ఉన్న చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలో అందరూ చూస్తుండగానే సొంత మేనమామ కఠారి మోహన్, ఆయన భార్యను హత్య చేసిన చింటూ వెనువెంటనే పరారయ్యాడు. అతడితో పాటు ఈ ఘటనకు పాల్పడ్డ నిందితులు మాత్రం పోలీసులకు లొంగిపోయారు. చింటూ కోసం వేట ముమ్మరమైంది. ఇప్పటికే అతడి ఇల్లు, కార్యాలయాలు సహా అతడి అనుచరుల ఇళ్లను సైతం పోలీసులు జల్లెడ పట్టారు.
తాజాగా అతడి ఆర్థిక మూలాలపైనా పోలీసులు దృష్టి సారించారు. దీంతో బెంబేలెత్తిన చింటూ... లొంగిపోయేందుకు తాను సిద్ధంగానే ఉన్నానని, అయితే చిత్తూరు పోలీసుల నుంచి తనకు ప్రాణహాని ఉందని అతడు ఓ తెలుగు దినపత్రిక కార్యాలయానికి నిన్న ఓ లేఖ రాశాడు. లేఖలో కనిపించిన చేతిరాత చింటూదేనని అతడి మిత్ర బృందం నిర్ధారించింది. సమాచారం అందుకున్న పోలీసులు సదరు మీడియా కార్యాలయానికి వెళ్లి లేఖను స్వాధీనం చేసుకున్నారు. లేఖలో చింటూ పేర్కొన్న అంశాలను సమగ్రంగా పరిశీలిస్తున్న పోలీసులు అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.