: నాగార్జున వర్సిటీలో పురివిప్పిన ర్యాగింగ్ భూతం... ఐదుగురు విద్యార్థులపై చర్యలు

ర్యాగింగ్ భూతం వేధింపులు తాళలేక ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కళాశాలలో ఆమధ్య బీఆర్క్ చదువుతున్న రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న సంఘటన అందరికీ ఇంకా గుర్తుండే వుంటుంది. చదువు కోసం వరంగల్ నుంచి గుంటూరు దాకా వచ్చిన ఆ చదువుల తల్లి బలవన్మరణం తెలుగు రాష్ట్రాల్లో పెను కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో వర్సిటీ అధికారులతో పాటు ఏపీ సర్కారు నిందితులపై కొరడా ఝుళిపించింది. అయినా అక్కడ ర్యాగింగ్ రక్కసి కోరలు ఊడలేదు. రిషితేశ్వరి చదివిన కళాశాలలోనే తాజాగా నిన్న మరోమారు ర్యాగింగ్ భూతం పడగ విప్పింది. జూనియర్లను ఐదుగురు సీనియర్లు వేధింపులకు గురి చేశారు. ఈ ఘటన వెలుగుచూడటంతో వర్సిటీ అధికారులతో పాటు ఏపీ సర్కారు కూడా షాక్ కు గురైంది. తాజా ఘటనపై వేగంగా స్పందించిన వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ లు ముగ్గురు విద్యార్థులు వినితేశ్వర్, మంజునాథ్, శ్వేతలను డిబార్ చేయడంతో పాటు మరో ఇద్దరు విద్యార్థులను రెండు నెలల పాటు సస్పెండ్ చేశారు. దీనిపై సమాచారం అందుకున్న ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వర్సిటీ అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. రిషితేశ్వరి ఘటన వెలుగు చూసిన కళాశాలలోనే తాజా ఘటన జరగడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఎల్లుండి ఆయన వర్సిటీలో పర్యటించనున్నారు.

More Telugu News