: ఈవీఎంలపై అభ్యర్థుల ఫొటోలు... తొలిసారిగా వరంగల్ ఉప ఎన్నికల్లోనే!
వరంగల్ ఉప ఎన్నికల్లో భాగంగా పలు కొత్త సంప్రదాయాలకు కేంద్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఇప్పటిదాకా పోలింగ్ లో వినియోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)లపై అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన గుర్తులు మాత్రమే ఉండేవి. అయితే నిరక్ష్యరాస్యులైన ఓటర్లు గుర్తులను గమనించినప్పటికీ, పేర్లను చదవలేక ఓట్లు వేయడంలో ఇబ్బందులు ఎదుర్కొనేవారన్న వాదన ఉంది. ఈ క్రమంలో ఒకరికి ఓటేయాలనుకుని మరొకరికి వేశామన్న భావన కూడా ఓటర్లలో ఉండేది.
అంతేకాక ఓటర్లను అయోమయంలోకి నెట్టేందుకు ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి పేరుతో ఉన్న మరో వ్యక్తిని ఆయా పార్టీలు బరిలోకి దింపేవి. వీటన్నిటికీ చెక్ పెట్టాలని భావించిన ఎన్నికల సంఘం అభ్యర్థుల పేర్లతో పాటు వారి ఫొటోలను కూడా ఈవీఎంలపై ముద్రించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని నేటి ఉదయం ప్రారంభమైన వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికల్లో అమలులోకి తెచ్చింది. ప్రస్తుతం వరంగల్ ఉప ఎన్నికలో వినియోగిస్తున్న ఈవీఎంలపై అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన గుర్తులు, వారి ముఖ చిత్రాలు ఉన్నాయి.