: పాతబస్తీ రోడ్లపై బైక్ రేసుల జోరు... పోలీసుల అదుపులో 100 మంది యువకులు

భాగ్యనగరి హైదరాబాదును బైక్ రేసుల జాడ్యం వీడేలా లేదు. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు, నెక్లెస్ రోడ్లపై విచ్చలవిడిగా సాగిన బైక్ రేసులకు పోలీసులు ఎట్టకేలకు చెక్ పెట్టారు. అయితే పోలీసులకు ఎప్పటికప్పుడు ఝలకిస్తున్న కుర్రకారు, తాము అత్యంత ప్రీతిపాత్రంగా భావించే బైక్ రేసులకు మాత్రం వీడ్కోలు పలకడం లేదు. ఓఆర్ఆర్, నెక్లెస్ రోడ్లపై పోలీసుల నిఘా పెరగడంతో యువత పాతబస్తీలో బైక్ రేసులకు తెర తీశారు. ఇప్పటికే రెండు, మూడు సార్లు పాతబస్తీలో జరిగిన బైక్ రేసులపైనా పోలీసులు దాడులు చేశారు. అయితే ఎప్పటికప్పుడు ప్రాంతాలను మారుస్తున్న యువత పోలీసుల కళ్లుగప్పి బైక్ లపై దూసుకుపోతోంది. నిన్న రాత్రి కూడా పాతబస్తీలో బైక్ రేసులు జోరుగా సాగాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు రేసులపై మెరుపు దాడి చేశారు. దాదాపు వంద మంది కుర్రాళ్లను అదుపులోకి తీసుకుని, వారి చేతుల్లోని బైకులను స్వాధీనం చేసుకున్నారు. మరికాసేపట్లో కుర్రాళ్ల తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు.

More Telugu News