: ఆన్ లైన్ షాపింగ్ 'భూతం' మిమ్మల్ని ఆవహించిందా? తెలుసుకోండిలా!
ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను తాకుతున్న సరికొత్త అలవాటు 'ఆన్ లైన్ షాపింగ్'. ఇంట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా ఆన్ లైన్ లో షాపింగ్ చేసేస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఇది ఓ చెడు అలవాటని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదో వస్తువు కోసం వెతికి, మరేదో అవసరం లేని వస్తువును కొనడం ద్వారా చేతి చమురు వదిలించుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ ఆన్ లైన్ షాపింగ్ 'భూతం' మిమ్మల్ని పట్టుకుందా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పి చూడండి... మీకే తెలుస్తుంది. 1. ఇది షాపింగ్ చేసే టైం. వదిలే సమస్యే లేదు అని ఎప్పుడైనా అనిపించిందా? 2. ఓ వస్తువు కోసం ఆన్ లైన్ స్టోర్ కు వెళ్లి, అక్కడే ఉండి మనసును ఆకర్షించిన మరో నిరుపయోగ వస్తువును కొనుగోలు చేశారా? 3. మీరు ఆన్ లైన్ షాపింగులో ఎక్కువగా గడుపుతున్నారని ఎవరైనా కామెంట్ చేశారా? అందుకు మీకు కోపం వచ్చిందా? 4. మీ కొనుగోలు అలవాట్లను పక్కవారి వద్ద దాచడానికి ఎన్నడైనా ప్రయత్నించారా? 5. డబ్బు ఖర్చవుతోందని భావిస్తూ, ఆన్ లైన్ షాపింగ్ ఆపేయాలని ఎన్నడైనా అనిపించిందా? 6. కోపం లేదా బాధ లేదా ఉత్సుకత మదిని నిండిన వేళ ఆన్ లైన్ కు వెళ్లి కొనేస్తున్నారా? 7. కొనేటప్పుడు బాగుంది, వస్తువు చేతికొచ్చాక ఎందుకు కొన్నామా? అని ఎన్నడైనా అనిపించిందా? 8. ఆ ఆన్ లైన్ ఆఫర్ ను మిస్ అయ్యామే అని బాధపడ్డ సందర్భాలు ఉన్నాయా? 9. ఈ-కామర్స్ సైట్లలో వెతికి వస్తువులు కొనేందుకు తగినంత సమయం మీకుందని భావిస్తున్నారా? 10. ఇంట్లోగానీ, ఆఫీసులోగానీ ఇతర పనులు మానేసి ఆన్ లైన్ షాపింగుకు సమయాన్ని కేటాయిస్తున్నారా? ఈ ప్రశ్నల్లో 8, అంతకన్నా ఎక్కువ ప్రశ్నలకు 'అవును' అన్న సమాధానం వస్తే, మీరు స్పష్టంగా ఆన్ లైన్ షాపింగ్ భూతానికి చిక్కినట్టే. దాన్ని సాధ్యమైనంత త్వరగా వదిలించుకోవాలి. ఏడు ప్రశ్నలకు 'అవును' అన్న సమాధానాలు వస్తే, మీరు నేడో రేపో ఆ భూతానికి చిక్కుతారని అర్థం. ఆరు ప్రశ్నలకు 'అవును' అన్న సమాధానాలు వస్తే, మీరు నెమ్మదిగా నైనా ఆన్ లైన్ భూతం దగ్గరకు వెళుతున్నట్టు.