: ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిందే: బాబు సర్కారుతో హైకోర్టు
అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతుల ప్రయోజనాలను ఎట్టి పరిస్థితుల్లోను కాపాడాలని హైకోర్టు చంద్రబాబు ప్రభుత్వానికి సూచించింది. వారికి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని, వాటిని ఎన్నికల హామీలుగా మార్చవద్దని సలహా ఇచ్చింది. "గతంలో రైతులకు ఇచ్చిన హామీలను పక్కన బెడితే మేం చూస్తూ ఊరుకోబోము" అని చీఫ్ జస్టిస్ దిలీప్ బీ భోసాలె, జస్టిస్ ఎస్ వీ భట్ లతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. భూసమీకరణకు అంగీకరించి భూములిచ్చిన గుంటూరు జిల్లాకు చెందిన కంచర్ల ఓంకార్, మరో 54 మంది రైతులు వేసిన పిటిషన్ పై కోర్టు విచారణ జరిపింది. రైతుల తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ఈ మనోహర్, భూ సేకరణ నిబంధనలను, రైతుల నుంచి భూములు తీసుకున్న తరువాత మార్చారని, దీనివల్ల రైతులకు అన్యాయం జరుగుతుందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఈ సవరణ వల్ల, రైతులకు ఇస్తామన్న ప్రయోజనాలు తగ్గుతాయని, తొలుత ఎటువంటి భూమిని ఇచ్చినా, ఎకరాకు 1200 గజాల అభివృద్ధి చెందిన స్థలాన్ని ఇస్తామని వెల్లడించారని, ఇప్పుడేమో మాగాణి, మెట్ట పొలాలంటూ, రైతులకు ఇవ్వాల్సిన భూమి పరిమాణాన్ని కుదించేలా నిబంధనలు మార్చారని వాదించారు. వాస్తవానికి సేకరించినదంతా మాగాణి భూమేనని, వ్యవసాయానికి కృష్ణా నది నుంచి నీరందకనే మెట్ట పంటలు వేసుకుంటున్నామని రైతుల తరఫున మనోహర్ కోర్టుకు తెలిపారు. వారి వాదనలు విన్న న్యాయమూర్తులు, రైతులకు అన్యాయం జరిగితే, అండగా నిలుస్తామని చెప్పారు.