: మేయర్ తలలో బులెట్లు దింపి, 'థ్యాంక్స్' చెప్పెళ్లిన దుండగులు... కఠారి అనుచరులపైనా అనుమానాలు!
చిత్తూరు మేయర్ కఠారి అనురాధ దంపతుల హత్య వెనుక ఆమె అనుచరుల హస్తం ఉందా? ఈ హత్య తరువాత మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అనురాధ, మోహన్ లపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన దుండగులు వెళుతూ, ఓ వ్యక్తికి 'థ్యాంక్స్' చెప్పినట్టు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు చెప్పడంతో, వారు ఈ విషయమై దృష్టిని సారించినట్టు సమాచారం. మేయర్ వర్గంలోని వారు ఎవరైనా దుండగులకు సహకరించారా? అన్న కోణంలోనూ పోలీసుల దర్యాఫ్తు సాగుతోంది.
కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ ఎక్కడ కూర్చుంటారు? దాడి చేసిన తరువాత సులువుగా ఏ వైపు నుంచి బయటకు పారిపోవచ్చు? వంటి విషయాలన్నీ నిందితులకు ముందే తెలుసునని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. తుపాకుల శబ్దం వినిపించిన అనంతరం కార్పొరేషన్ ద్వారాలు మూసేయగా, ఆ వెంటనే దుండగులు ప్రజారోగ్య శాఖ విభాగం పక్కనే ఉన్న గోడను దూకి పారిపోయారు. అక్కడ గోడపై గ్రిల్ కూడా లేదు. ఈ విషయంపై కూడా దుండగులకు సమాచారం ఉందని పోలీసులు భావిస్తున్నారు. కార్పొరేషన్ నిర్మాణంపై పూర్తిగా తెలిసిన వ్యక్తి నిందితులకు పారిపోయే మార్గాన్ని చూపినట్టు తెలుస్తుండగా, పోలీసుల అనుమానితుల జాబితా కాస్తంత పెద్దగానే ఉన్నట్టు సమాచారం.