: ఆరంభ నష్టాల నుంచి అద్భుత రికవరీ!
ఓ వైపు అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్న వేళ ఆరంభంలోని నష్టాల నుంచి సూచికలు అద్భుత రికవరీ దిశగా పయనించాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లతో పాటు దేశవాళీ ఫండ్ సంస్థలు ఈక్విటీల కొనుగోలుకు దిగడంతో ఉదయం 11 గంటల తరువాత సూచికలు ఏ దశలోనూ వెనక్కు తిరిగి చూడలేదు. ఒకదశలో 25,455 పాయింట్ల వద్ద ఉన్న సెన్సెక్స్ 25,850 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకింది. సోమవారం నాటి సెషన్లో బీఎస్ఈ సెన్సెక్స్ 149.57 పాయింట్లు పెరిగి 0.58 శాతం లాభంతో 25,760.10 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 44.35 పాయింట్లు పెరిగి 0.57 శాతం లాభంతో 7,806.60 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.22 శాతం, స్మాల్ క్యాప్ 0.50 శాతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ-50లో 18 కంపెనీలు మాత్రమే లాభాల్లో నడిచాయి. టాటా స్టీల్, గెయిల్, వీఈడీఎల్, ఎస్బీఐ, డాక్టర్ రెడ్డీస్ తదితర కంపెనీలు లాభపడగా, కోల్ ఇండియా, హిందుస్థాన్ యూనీలివర్, టాటా పవర్, హీరోమోటో, పవర్ గ్రిడ్ తదితర కంపెనీలు నష్టపోయాయి. ఈ సెషన్లో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 96,43,268 కోట్లకు తగ్గింది. మొత్తం 2,803 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,375 కంపెనీలు లాభాలను, 1,260 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి.