: వాయవ్య పాకిస్థాన్ లో 73 ఏళ్ల తరువాత తెరుచుకున్న గురుద్వారా
సరైన పరదా వ్యవస్థ లేదంటూ స్థానికులు అభ్యంతరం చెప్పడంతో 1942లో మూసుకుపోయిన పెషావర్ లోని ఓ గురుద్వారా తలుపులు 73 సంవత్సరాల తరువాత ఇప్పుడు తెరుచుకున్నాయి. ఇన్ని సంవత్సరాల నుంచి మూతపడిన ఈ గురుద్వారా వాయవ్య పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ రాజధాని పెషావర్ కు సమీపంలోని జోగివారలో ఉంది. ఈ సమస్యపై సిక్కులు, ఇతర స్థానికులతో పెషావర్ డిప్యూటీ కమిషనర్ రియాజ్ మెహసూద్ ఈ మేరకు సమావేశం నిర్వహించారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రికి మైనారిటీ వ్యవహారాల సలహాదారుగా వ్యవహరించే సురాన్ సింగ్, పోలీసులు, స్థానిక అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు.
పరదా విధానానికి తగిన ఏర్పాట్లు చేస్తే గరుద్వారాను తిరిగి తెరవడంపై తమకు అభ్యంతరం లేదని స్థానికులు తెలిపారు. అంతేగాక సిక్కులు పూజలు చేసేటప్పుడు స్థానికులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా గురుద్వారా చుట్టపక్కల ప్రహరీ గోడను నిర్మిస్తామని పెషావర్ డిప్యూటీ కమిషనర్ మెహసూద్ చెప్పారు. దాంతో స్థానికులు, సిక్కులు, పరిపాలన యంత్రాంగం మధ్య సయోధ్య కుదిరింది. పర్యవసానంగా చాలాకాలానికి మళ్లీ గురుద్వారలో ప్రార్థనలు మొదలయ్యాయి.