: టోకు ధరలు తగ్గాయట... వాస్తవానికి ఆమడ దూరంగా ప్రభుత్వ లెక్కలు!


ఇండియాలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. టోకు ధరలు దిగొచ్చాయని సోమవారం ఉదయం కేంద్ర గణాంకాల శాఖ ఓ రిపోర్టును విడుదల చేసింది. దీని ప్రకారం, అక్టోబరులో హోల్ సేల్ ధరలు మైనస్ 3.81 శాతానికి పడిపోయాయి. దీంతో టోకు ధరల సూచిక వరుసగా 12వ నెలలోనూ తగ్గుదలను నమోదు చేసినట్లయింది. అంతకుముందు సెప్టెంబరులో మైనస్ 4.54 శాతంగా ఉన్న సూచికపై ఇంధన ధరల తగ్గుదల ప్రభావం పడడంతో, వాస్తవ గణాంకాలు మరుగున పడుతున్నాయని నిపుణులు వ్యాఖ్యానించారు. కాగా, అక్టోబరులో ఆహార ఉత్పత్తుల ధరలు 2.44 శాతం పెరిగినట్టు కేంద్రం వెల్లడించింది. ఇన్ ఫ్లేషన్, వ్యతిరేక దిశకు పడిపోవడానికి కమోడిటీ ధరల తగ్గుదలే కారణమని కేంద్రం ప్రకటించింది. గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే ఇంధన ధరలు 15 శాతానికి పైగా తగ్గడం మొత్తం గణాంకాలపై ప్రభావం చూపిందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ద్రవ్యోల్బణం పెరగడం ఎంత ప్రమాదకారో, ప్రతి ద్రవ్యోల్బణం (డిఫ్లేషన్) నమోదై గణాంకాలు 'మైనస్'లోకి వెళ్లడమూ అంతే ప్రమాదాన్ని సూచిస్తుంది. ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గుతుంది. ఫలితంగా ఆర్థికమాంద్యం ఏర్పడుతుంది. కేవలం ఇంధన ధరల కారణంగానే ఈ పరిస్థితి సంభవించిందని గుర్తు చేస్తూ, ప్రస్తుతానికి అటువంటి భయాలేమీ లేవని ఆర్థికవేత్తలు భరోసా ఇస్తున్నారు.

  • Loading...

More Telugu News