: ఏబీ ‘వందో’ టెస్టులోనూ సఫారీలకు చుక్కలేనా?...వికెట్ల వేట మొదలెట్టిన టీమిండియా!
ఫ్రీడమ్ సిరీస్ లో భాగంగా బెంగళూరులో కొద్దిసేపటి క్రితం మొదలైన రెండో టెస్టు సఫారీ స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ కు వందో టెస్టు. తమ జట్టు విజయసారథి ఏబీకి ఈ టెస్టులో విజయం సాధించి కానుకగా ఇవ్వాలన్న సఫారీల కల నెరవేరేలా లేదు. మ్యాచ్ లో టాస్ నెగ్గిన టీమిండియా పర్యాటక జట్టును తొలి బ్యాటింగ్ కు ఆహ్వానించింది. తొలి టెస్టులో స్పిన్ తో మ్యాచ్ ను తిప్పేసిన టీమిండియా రెండో టెస్టులోనూ అదే అస్త్రాన్ని ప్రయోగించింది. ఆదిలోనే రెండు కీలక వికెట్లను నేలకూల్చి సఫారీలకు డేంజర్ బెల్స్ మోగించింది.
తొలి టెస్టులో సత్తా చాటిన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెండో టెస్టులోనూ బంతిని గింగిరాలు తిప్పాడు. ఒకే ఓవర్ లో రెండు వికెట్లను కుప్పకూల్చాడు. ఓపెనర్ వాన్ జెల్ (10)ను ఎల్బీగా పెవిలియన్ చేర్చిన అశ్విన్ అదే ఓవర్ లో మరో స్టార్ ప్లేయర్ డుప్లెసిస్(0) ను డకౌట్ చేశాడు. అశ్విన్ వేసిన బంతిని ఆడబోయిన డుప్లెసిస్ పుజారా చేతికి చిక్కాడు. 14 ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా రెండు కీలక వికెట్లు కోల్పోయి 42 పరుగులు చేసింది. ఎల్గర్ (25), హషీమ్ ఆమ్లా (6) పరుగులతో క్రీజులో ఉన్నారు.