: ప్యారిస్ పై ‘ఉగ్ర’ పంజా... ఉగ్రవాదుల కాల్పుల్లో 170 మందికి పైగా మృతి

ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ పై నిన్న రాత్రి ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఓ వైపు ఫ్రాన్స్, జర్మనీ ఫుట్ బాల్ జట్ల మధ్య ఉత్కంఠభరిత మ్యాచ్ జరుగుతున్న సమయంలో మెరుపు దాడికి దిగిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు దిగారు. ఆరు చోట్ల కాల్పులు, మూడు చోట్ల బాంబు దాడుల్లో 170 మందికి పైగా జనం ప్రాణాలు కోల్పోయారు. వందలాది మందికి గాయాలయ్యాయి. నగరంలోని బటక్లాన్ థియేటర్ వద్దే ఉగ్రవాదులు ఏకంగా వంద మందిని పొట్టనబెట్టుకున్నారు. థియేటర్లోని వారిని బందీలుగా పట్టుకున్న ఉగ్రవాదులు వారిని నిలబెట్టి మరీ కాల్చి చంపారు. ఉగ్రవాదుల మెరుపు దాడిపై వేగంగా స్పందించిన ప్యారిస్ పోలీసులు ముగ్గురు ముష్కరులను కాల్చి చంపారు. మరింత మంది ఉగ్రవాదులు ప్యారిస్ లోకి చొరబడి ఉంటారన్న అనుమానంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు పరిస్థితిని సమీక్షించిన ఫ్రెంచ్ బలగాలు దేశం సరిహద్దులను మూసివేశాయి. అంతేకాక ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. ప్రస్తుతం ప్యారిస్ లో కాల్పులు జరిగిన ప్రాంతాల్లో భీతావహ వాతావరణం నెలకొంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు, పోలీసుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి.

More Telugu News