: గురకీరత్ ను ఆకాశానికెత్తిన కోహ్లీ
టీమిండియా కెప్టెన్ కోహ్లీ వర్ధమాన ఆటగాళ్లను ప్రోత్సహించడంలో గంగూలీని అనుసరిస్తున్నట్టు కనపడుతోంది. తుది జట్టులో ఇంకా స్థానం ఖరారు కాని ఆటగాడిని కోహ్లీ ఆకాశానికెత్తేయడం చూసి సీనియర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియాలో వర్గపోరు పెరిగిపోతోంది. ధోనీ, కోహ్లీ వర్గాలుగా జట్టు విడిపోయింది. టెస్టుల్లో అంతా కోహ్లీ పక్కన చేరడం, వన్డే, టీట్వంటీలు వచ్చేసరికి ధోనీ పక్కకి చేరడం సాధారణంగా మారింది. తాను ఏం చేసినా ధోనీ ప్రభావాన్ని తగ్గించలేనని అర్థం చేసుకున్న కోహ్లీ వర్ధమాన ఆటగాళ్ల విషయంలో తన వ్యూహం అమలు చేస్తున్నాడు. అందులో భాగంగా వర్ధమాన ఆల్ రౌండర్ గురుకీరత్ సింగ్ ను అమాంతం ఆకాశానికెత్తేస్తున్నాడు.
భారత్ ఏ జట్టులో ఆడుతూ, టీమిండియాలో చోటు సంపాదించిన గురుకీరత్ అత్యంత ప్రమాదకరమైన ఆటగాడని కోహ్లీ పేర్కొంటున్నాడు. భారత్ కు ప్రధాన సమస్య అయిన ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్ కు గురుకీరత్ అతికినట్టు సరిపోతాడని కోహ్లీ చెబుతున్నాడు. ప్రత్యర్థి నుంచి ఏ క్షణాన అయినా మ్యాచ్ ను లాగేసుకోగల సామర్థ్యం గురుకీరత్ సొంతమని టెస్టు కెప్టెన్ అభిప్రాయపడ్డాడు. స్వతహాగా బ్యాట్స్ మన్ అయినా అద్భుతంగా బౌలింగ్ చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తాడని కోహ్లీ చెప్పాడు. రానున్న ఏడాదిన్నర కాలంలో టీమిండియా చాలా టెస్టులు ఆడాల్సి ఉందని, గురుకీరత్ లాంటి ఆటగాడు టీమిండియాకు అవసరం అంటూ సెలక్టర్లకు పరోక్షంగా సూచనలు పంపుతున్నాడు.