: రూ. 393 లక్షల కోట్లకు ఎదగనున్న భారత ఎకానమీ... ఏం చేస్తే ఆ లాభం చేతికందుతుంది?
సమీప భవిష్యత్తులో ఇండియా 6 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ. 393 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థగా మారుతుందన్నది నిపుణుల అంచనా. ఇండియా ఎదుగుతోందన్నది ఎన్నో రోజులుగా వింటున్నదే. అయితే, గత కొన్నేళ్లుగా ఇండియా శరవేగంగా వృద్ధి దిశగా సాగుతోంది. ఇప్పటికే కొన్ని రంగాల్లో చైనాను దాటింది. ఇక తదుపరి మన కన్ను జీ-8 (అభివృద్ధి చెందిన దేశాల సమాఖ్య) పైనే. అయితే, ఇప్పటికిప్పుడు జీ-8లో స్థానం పొందలేకపోయినా, సాధ్యమైనంత త్వరలోనే ఇండియా ఈ ఎలైట్ జాబితాలో స్థానం దక్కించుకుంటుందన్నది ఎన్నో దేశాల అభిప్రాయం. భారత్ ఎదుగుతున్న దశలో లాభపడాలంటే ఏం చేయాలో చూద్దాం... ఏ దేశ అభివృద్ధిలో అయినా, తొలి భాగం పంచుకునేది స్టాక్ మార్కెట్లు, ఆ దేశానికి వచ్చే పెట్టుబడులు. అందుకే భారత కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా అభివృద్ధిలో భాగంతో పాటు లాభాలనూ అందుకోవచ్చని సూచిస్తున్నారు నిపుణులు. ఆసియాలో మూడవ అతిపెద్ద ఎకానమీగా ఉన్న భారత్ ప్రస్తుతం 2 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ. 125 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థగా ఉంది. వచ్చే 10 సంవత్సరాల వ్యవధిలో ఇది మూడు రెట్ల వరకూ పెరగవచ్చని అంచనా. ఇదే సమయంలో స్టాక్ మార్కెట్ నాలుగు నుంచి ఐదు రెట్ల వరకూ పెరిగే అవకాశాలు పుష్కలం. అంటే ప్రస్తుతం 26 వేల వద్ద ఉన్న సెన్సెక్స్ కనీసం లక్ష పాయింట్ల మార్క్ ను అధిగమిస్తుంది. అంటే రూపాయి విలువైన వాటా ఐదు రూపాయలకు పెరిగే అవకాశాలు ఉన్నట్టు. "కాలం గడిచేకొద్దీ జీడీపీని మించిన వేగంతో ఈక్విటీ మార్కెట్లు పెరుగుతాయి. వచ్చే పదేళ్లలో ఇండియా సగటున 13 శాతం జీడిపీ వృద్ధిని నమోదు చేయవచ్చు. అదే జరిగితే మన ఎకానమీ రూ. 393 లక్షల కోట్ల నుంచి రూ. 520 లక్షల కోట్ల మధ్యలో ఉంటుంది. ఇప్పటికైతే ఆ ఊహ కూడా అందదు. కానీ అది నిజమవుతుంది" అని రిలయన్స్ కాపిటల్ ఏఎంసీ చీఫ్ ఇన్వెస్ట్ మెంట్ స్ట్రాటజిస్ట్ మధుసూదన్ కేలా వివరించారు. ఇప్పటినుంచి వచ్చే 5 లేదా 10 సంవత్సరాల కాల పరిమితి తీసుకుంటే, పెట్టే పెట్టుబడి ఎన్నో రెట్లు రాబడిని అందిస్తుందని ఆయన అంచనా వేశారు. కాగా, గత సంవత్సరం వ్యవధిలో స్టాక్ మార్కెట్లు నష్టాల బాటలోనే నడిచాయి. కార్పొరేట్ల కంపెనీల ఫలితాలు కూడా నిరాశాజనకంగానే ఉన్నాయి. ఇది కొత్త ఇన్వెస్టర్లు మార్కెట్లలోకి ప్రవేశించేందుకు సువర్ణావకాశమని విశ్లేషకులు చెబుతున్నారు. చైనాలో ఆర్థికమాంద్యం నుంచి క్రూడాయిల్ ధరల వరకూ ప్రతి అంశమూ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోందని, ఒకసారి పరిస్థితులు 'బుల్' ట్రెండ్ లోకి వెళితే, అందుకోవడం కష్టమవుతుందని మార్కెట్ నిపుణుల అంచనా. "క్వాలిటీ ఉన్న స్టాక్స్ ఎంపిక చేసి పట్టుకునేందుకు ఎన్నో బంగారు అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో... అంటే 2015-2016లో ఈ అవకాశాలు ఇంకా ఎక్కువగా కనిపిస్తున్నాయి. బిగ్ బుల్ రన్ కు ఇవి తొలి అడుగులు" అని ఐఐఎఫ్ఎల్ రీసెర్చ్ హెడ్ అమర్ అంబానీ అభిప్రాయపడ్డారు. మిగతా దేశాలతో పోలిస్తే, ఇండియా శరవేగంగా దూసుకెళ్లనుందని, అందుకు అవకాశాలు పుష్కలమని ఆయన వివరించారు. (మార్కెట్ లాభాలను, భారత వృద్ధిని కళ్లజూస్తూ, ఆ ప్రయోజనాలను స్వయంగా పొందాలంటే, సామాన్య, మధ్యతరగతి ప్రజలకు కనిపించేది స్టాక్ మార్కెట్ మాత్రమే. ఏదిఏమైనా ఈక్విటీ మార్కెట్లలో దీర్ఘకాలంలో లాభాలు ఖాయమేగానీ, స్వల్పకాలిక పెట్టుబడుల్లో రిస్క్ దాగుంటుంది. అయితే, సమయానుకూలంగా ఎంపిక చేసిన ఈక్విటీలను, ఫండమెంటల్స్ బాగున్న కంపెనీలను ఎంపిక చేసుకుని పెట్టుబడులు పెట్టాలన్నది సలహా)