: బయ్యారంలో స్టీల్ ప్లాంట్ కు సన్నాహాలు...సెయిల్, ఎన్ఎండీసీ, సింగరేణి బాసులతో రాజీవ్ శర్మ భేటీ

ఖమ్మం జిల్లా బయ్యారం ప్రజల ‘ఉక్కు కర్మాగారం’ కల నెరవేరనుంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తెరపైకి వచ్చిన బయ్యారం స్టీల్ ప్లాంట్, నాడు ఆయన కుటుంబ సభ్యులపై వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలతో ఒక్కసారిగా అటకెక్కింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరగడం, తెలంగాణలో కేసీఆర్ తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో కాస్త ఆలస్యంగానైనా మరోమారు బయ్యారం స్టీల్ ప్లాంట్ పై చర్చ మొదలైంది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ... స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) ఎండీ, నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) ఎండీ, సింగరేణి కాలరీస్ సీఎండీలతో కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు. బయ్యారంలోని ఇనుప ఖనిజాన్ని వినియోగించుకుని అక్కడే స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేసే అవకాశాలపై రాజీవ్ శర్మ కీలక చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. బయ్యారంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని గతంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాజీవ్ శర్మ ప్రభుత్వ రంగ సంస్థల ఉన్నతాధికారులతో చర్చలకు తెర తీశారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

More Telugu News