: మీ ‘డోంట్ కేర్’ పద్ధతేమీ బాగోలేదు... బ్రిటిష్ ఎయిర్ వేస్ పై సచిన్ చిందులు!
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆగ్రహంతో ఊగిపోయారు. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే సచిన్ చిరాకు పడటం దాదాపుగా మనం చూసి ఉండం. అందుకు భిన్నంగా బ్రిటిష్ ఎయిర్ వేస్ పై ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. అది కూడా విశ్వవ్యాప్తమైన సోషల్ మీడియాలో. ప్రస్తుతం ఆల్ స్టార్ క్రికెట్ టోర్నీ కోసం అమెరికాలో ఉన్న సచిన్, తన కుటుంబ సభ్యులకు సీట్లు కేటాయించడంలో బ్రిటిష్ ఎయిర్ వేస్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ట్విట్టర్ వేదికగా ఆరోపణలు గుప్పించారు.
సీట్లు ఖాళీగా ఉన్నప్పటికీ తన కుటుంబసభ్యుల టికెట్లు కన్ ఫర్మ్ చేయకుండా ఆ విమానయాన సంస్థ తమను ఇబ్బందులకు గురి చేసిందని సచిన్ మండిపడ్డారు. బ్రిటిష్ ఎయిర్ వేస్ వ్యవహార సరళితో తాను అసహనానికే కాక అసంతృప్తి, ఆగ్రహానికి కూడా గురయ్యానని సచిన్ వ్యాఖ్యానించారు. అంతేకాక తన లగేజీని తాము సూచించిన గమ్యానికి కాకుండా వేరే ప్రాంతానికి తరలించిందని కూడా శివాలెత్తారు ‘‘నా పట్ల మీ ‘డోంట్ కేర్’ వ్యవహార సరళి ఏమీ బాగోలేదు’’ అంటూ సచిన్ ఘాటు వ్యాఖ్యలే చేశారు. అయితే సచిన్ కామెంట్లపై బ్రిటిష్ ఎయిర్ వేస్ కూడా వేగంగానే స్పందించింది. లగేజీ వివరాలు పూర్తి అడ్రెస్ ఇస్తే అక్కడికే చేరుస్తామని ఆ సంస్థ పేర్కొంది.