: 'రష్యన్ల రక్తం సముద్రమై పారుతుంది'... ఐఎస్ఐఎస్ తీవ్ర హెచ్చరిక

రష్యాపై తమ దాడులు అతి త్వరలో మొదలవుతాయని, వారి రక్తం సముద్రమై పారుతుందని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు తమ తాజా వీడియోలో హెచ్చరికలు జారీ చేశారు. తమ ప్రాంతంపై రష్యా సైన్యం జరుపుతున్న దాడులకు వ్యతిరేకంగా ఆ దేశం శిక్షను అనుభవిస్తుందని, అల్ హయత్ మీడియా సెంటర్ నుంచి విడుదలైన వీడియో సందేశంలో ఉగ్రవాదులు చెప్పారు. చార్లీ హెబ్డో కాల్పులు, ఆపై కొందరు బందీల మరణాలతో కూడిన వీడియోలో ఐఎస్ఐఎస్ కు చెందిన ఒక నేత మాట్లాడాడు. ఈ వీడియోలో సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి. రష్యా త్వరలోనే మరణించనుందని, దాడులు చేస్తున్న వారితో పాటు వారి దేశీయుల మెడలను కత్తులు తెగనరుకుతాయన్న అర్థం వచ్చేలా అతను మాట్లాడాడు. కాగా, ఈజిప్టులోని సినాయ్ పెనిన్సులాలో రష్యా ప్రయాణికుల విమానాన్ని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కూల్చేసిన తరువాత, సిరియాలోని పలు స్థావరాలపై సైన్యం దాడుల సంఖ్య పెరిగిన సంగతి తెలిసిందే.

More Telugu News