: ఏఎస్సై వడ్డీ వ్యాపారంలో పెట్టుబడుల ఫలితం!... బదిలీ వేటుకు గురైన కరీంనగర్ ఏఎస్పీ
తెలంగాణలోని కరీంనగర్ జిల్లా అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డిని బదిలీ చేస్తూ నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత ఉత్తర్వులు జారీ అయ్యాయి. వెనువెంటనే కరీంనగర్ ఏఎస్పీ బాధ్యతలను వదిలి డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆయనను ఉన్నతాధికారులు ఆదేశించారు. ఉన్నపళంగా జనార్దర్ రెడ్డి ఎందుకు బదిలీ అయ్యారన్న కారణాలపై పోలీసు వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. తన కింద పనిచేస్తున్న ఏఎస్సై మోహన్ రెడ్డి వడ్డీ వ్యాపారం నడుపుతుంటే, ఆ వ్యాపారానికి జనార్దన్ రెడ్డి పెట్టుబడి పెడుతున్నారట. డబ్బు అవసరం ఉన్న వారికి అప్పులివ్వడమే పనిగా పెట్టుకున్న మోహన్ రెడ్డి, రుణ గ్రహీతల నుంచి వారి స్థిరాస్తులను రాయించుకుంటూ వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మోహన్ రెడ్డి వేధింపులు తాళలేక కరీంనగర్ లోని కెన్ క్రెస్ట్ స్కూల్ డైరెక్టర్ ప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసు నేపథ్యంలో మోహన్ రెడ్డి వడ్డీ వ్యాపారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను చేపట్టిన తెలంగాణ సీఐడీ పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేయగా, మోహన్ రెడ్డి వడ్డీ వ్యాపారంలో జనార్దన్ రెడ్డి పెట్టుబడులు వెలుగుచూశాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం జనార్దన్ రెడ్డిపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో డీజీపీ కార్యాలయం ఆయనపై బదిలీ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దర్యాప్తులో మరిన్ని కీలక ఆధారాలు సేకరించిన తర్వాత జనార్దన్ రెడ్డిపై చర్యలు తప్పవని పోలీసు వర్గాలు చెప్పుకుంటున్నాయి.