: రవాణా శాఖ కమిషనర్ సుబ్రహ్మణ్యంను బదిలీ చేయాలి: ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు
ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ కమిషనర్ సుబ్రహ్మణ్యం వేధింపులపై ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు ఇవాళ సీఎం చంద్రబాబును కలిశారు. ఆయనతో పాటు పాటు రవాణ సంస్థకు చెందిన ఉద్యోగులు కూడా కలిసి... ఉద్యోగ సంఘ నేతలను కమిషనర్ వేధింపులకు గురి చేస్తున్న తీరును సీఎంకు వివరించారు. అనంతరం అశోక్ బాబు మీడియాతో మాట్లాడుతూ, 56 సర్వీసులను ప్రైవేటీకరించేందుకు కమిషనర్ ప్రయత్నిస్తున్నారన్నారు. గతంలో సుబ్రహ్మణ్యం వేధింపులపై రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు కూడా ఫిర్యాదు చేశామని, అయినా వారు పట్టించుకోలేదని తెలిపారు. అందుకే ఇప్పుడు చంద్రబాబును కలిశామని చెప్పారు. ఈ క్రమంలో కమిషనర్ ను తక్షణమే బదిలీ చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేసినట్టు వెల్లడించారు.