: హంద్రీ-నీవా గండిపై స్పందించిన చంద్రబాబు... సీఎం ఆదేశాలతో కృష్ణగిరికి కర్నూలు కలెక్టర్


రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు ఉద్దేశించిన హంద్రీ-నీవా సుజల స్రవంతి కాలువకు పడిన గండిపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వేగంగా స్పందించారు. నిన్న రాత్రి కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం లక్కసాగరం వద్ద హంద్రీ-నీవా కాలువకు గండి పడిన సంగతి తెలిసిందే. కాలువ నీటిని తోడేందుకు ఏర్పాటు చేసిన లిఫ్ట్ మోటార్లు ఫెయిల్ కారణంగా గండి పడింది. దీంతో కాలువ నీటితో లక్కసాగరం జలమయమైంది. విషయం తెలుసుకున్న వెంటనే చంద్రబాబు కర్నూలు కలెక్టర్ కు ఫోన్ చేశారు. తక్షణమే గండిని పూడ్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో నేటి ఉదయమే కర్నూలు నుంచి బయలుదేరిన కలెక్టర్ గండి పడిన ప్రదేశాన్ని పరిశీలించారు. గండి పూడ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆయన ప్రాజెక్టు ఇంజినీర్లకు ఆదేశాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రేపటిలోగా గండిని పూడ్చివేస్తామని ప్రకటించారు. గండి పడిన కారణంగా 60 ఎకరాల్లో పంటకు నష్టం జరిగిందని, నష్టపోయిన పంటకు సంబంధించి రైతులకు పరిహారం చెల్లిస్తామని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News