: ఏమిటీ వింత!...ఆశ్చర్యపోతున్న బీజేపీ పెద్దలు
బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ నివాసంలో ఆ పార్టీ సీనియర్లు యశ్వంత్ సిన్హా, మురళీ మనోహర్ జోషీ, శాంతకుమార్ తదితరులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీహార్ ఎన్నికలు, ఫలితాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. బీహార్ అసెంబ్లీ ఫలితాలు క్రమంగా పార్టీ ప్రతిష్ఠ మసకబారడాన్ని సూచిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. పార్టీలో క్రమశిక్షణ లోపించడం వల్లే వ్యతిరేక ఫలితాలు వచ్చాయని వారు పేర్కొన్నారు. బీహార్ ఎన్నికల ప్రతికూల ఫలితాలలో అందరి వైఫల్యం ఉందనడంపై వారు అసహనం వ్యక్తం చేశారు. బీహార్ ఎన్నికల్లో ఎవరు ప్రణాళికలు రచించారో, ప్రచారం నిర్వహించారో, అభ్యర్థుల ఎంపిక నుంచి ర్యాలీల ఏర్పాటు వరకు ఎవరు క్రియాశీలకంగా వ్యవహరించారో వారు ఓటమి బాధ్యతను తీసుకోవడం మానేసి, అందరిపై ఓటమిభారం వేయడమేంటని వారు విస్తుపోయారు. అలాగే ఎన్నికల్లో ప్రచారం చేసినవారే ఫలితాలను విశ్లేషించడం ఏమిటని వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బీజేపీలో తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు పార్టీ భవితవ్యానికి మంచిది కాదని వారు అభిప్రాయపడ్డారు.