: ముప్పు తప్పింది... బలహీనపడుతున్న వాయుగుండం!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలహీనపడి వాయుగుండంగా మారడం, ఆపై అది అల్పపీడనం దిశగా మారుతుండటంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పెను ప్రమాదం తప్పినట్లైందని వాతావరణ శాఖ అధికారులు వ్యాఖ్యానించారు. ఇప్పటికే, రేవాను తమిళనాడుతో పాటు దక్షిణ కోస్తాను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే వస్తున్న మరో తుపానుతో ప్రజలు మరిన్ని ఇబ్బందులు పడటమే కాకుండా, సహాయక చర్యలకు తీవ్ర విఘాతాలు ఏర్పడవచ్చని అధికారులు భయాందోళనలకు గురయ్యారు. ఇప్పుడీ రెండో తుపాను బలహీనపడి 12 గంటల్లో అల్పపీడనంగా మారనుందని వచ్చిన సూచనలతో కాస్తంత ఊపిరి తీసుకునే పరిస్థితి. ప్రస్తుతం వేలూరుకు దక్షిణ ఆగ్నేయ దిశగా 60 కి.మీ దూరంలో ఉన్న ఈ వాయుగుండం పడమర దిశగా వెళుతూ బలహీన పడుతోందట. దీని ప్రభావంతో రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురవవచ్చని అధికారులు తెలిపారు.