: విజయవాడలో రూ. 15 కోట్లతో పరారైన బిల్డర్
ఏపీ రాజధానిగా అమరావతి ఎంపికైన మరుక్షణం నుంచి గుంటూరు, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూములకు రెక్కలొచ్చాయి. రాజకీయవేత్తలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, రియల్టర్లు, ప్రముఖులు ఇలా ప్రతిఒక్కరూ ఇక్కడ భూములు కొనేందుకు క్యూ కడుతున్నారు. ఇదే సమయంలో ఘరానా మోసగాళ్లు కూడా కార్యరంగంలోకి దూకారు. తాజాగా, విజయవాడ ప్రసాదంపాడులో బిల్డర్ చలసాని కృష్ణ రూ. 15 కోట్లతో ఉడాయించాడు. ప్లాట్ల అమ్మకాలను ఒకరికి తెలియకుండా మరొకరికి ఇలా పలువురికి అమ్మి రూ. 15 కోట్లను కృష్ణ వసూలు చేశాడు. అనంతరం, డబ్బుతోపాటు చెక్కేశాడు. దీంతో, లబోదిబోమన్న బాధితులు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు కృష్ణ కోసం గాలింపు చేపట్టారు.