: మమతను ఆహ్వానించిన నితీశ్... 'దీదీ, మోదీ భాయ్ భాయ్' అన్న లెఫ్ట్!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన అనంతరం తనకు మద్దతుగా నిలిచిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, నితీశ్ కుమార్ ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపిన వేళ, వామపక్ష నేతలు మాత్రం మమతను నమ్మవద్దని హితవు పలికారు. 'దీదీ, మోదీ భాయ్ భాయ్' అని ట్వీట్ చేసిన సీపీఎం నాయకుడు, బెంగాల్ విపక్ష నేత సూర్యకాంత్ మిశ్రా, వీరిద్దరూ నాణానికి రెండు వైపుల వంటి వారని, మత రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. త్వరలోనే బెంగాల్ లో సైతం మమత సర్కారు ఇంటికి వెళ్లనుందని మరో ఎమ్మెల్యే సలీమ్ వ్యాఖ్యానించారు.
కాగా, నితీశ్ ప్రమాణ స్వీకారానికి మమతా బెనర్జీ వెళ్లక పోవచ్చని సమాచారం. "నేను గతంలో నితీశ్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వెళ్లాను. అప్పుడే మరోసారి ముఖ్యమంత్రి కావాలని, ఇంకో ప్రమాణ స్వీకారం చేయాలని కూడా శుభాకాంక్షలు చెప్పాను" అని ఆమె కోల్ కతాలో వ్యాఖ్యానించారు. ఆమె మాటలతో మమత పాట్నా పర్యటన అనుమానమేనన్న ఊహాగానాలకు బలం చేకూరినట్లయింది.