: బిజినెస్ టైకూన్ స్వరాజ్ పాల్ కుమారుడి దుర్మరణం...8వ ఫ్లోర్ నుంచి కింద పడ్డ వైనం
బ్రిటన్ లో స్థిరపడ్డ ప్రవాస భారతీయ వ్యాపార దిగ్గజం లార్డ్ స్వరాజ్ పాల్ ఇంట నిన్న ఘోరం జరిగిపోయింది. దీపావళి పర్వదినం సందర్భంగా వెలుగు దివ్వెలతో కళకళలాడాల్సిన స్వరాజ్ పాల్ ఇంట విషాదం చోటుచేసుకుంది. స్వరాజ్ పాల్ కుమారుడు, కపారో గ్రూపు సంస్థల సీఈఒ అంగద్ పాల్(45) దుర్మరణం పాలయ్యారు. లండన్ లోని తన ఇంటిలోని ఎనిమిదో అంతస్తు నుంచి కిందపడ్డ అంగద్ అక్కడికక్కడే చనిపోయారు. ఎనిమిదో అంతస్తులోని పెంట్ హౌస్ లో ఉన్న సమయంలో అంగద్ పాల్ ఉన్నట్టుండి కిందపడిపోయారు. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ మాసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)లో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసిన అంగద్ కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. విద్యాభ్యాసం ముగిసిన వెంటనే తండ్రి నిర్మించిన వ్యాపార సామ్రాజ్యం ‘కపారో’లో అడుగుపెట్టిన అంగద్, ప్రస్తుతం సీఈఓగా పనిచేస్తున్నారు. ఎనిమిదో అంతస్తు నుంచి కింద పడటంతో తీవ్ర గాయాలపాలైన అంగద్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరిలించినా, అప్పటికే ఆయన చనిపోయారని వైద్యులు నిర్ధారించారు. మరో రెండు రోజుల్లో దీపావళి ఉందనగా అంగద్ దుర్మరణం చెందడంతో స్వరాజ్ పాల్ ఇంట విషాదం నెలకొంది.