: ధోనీ ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయనున్నాడా?

టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ లో జట్టును కొనుగోలు చేయనున్నాడనే వార్తలు స్పోర్ట్స్ సర్కిల్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఫుట్ బాల్ టీమును కొనుగోలు చేసిన ధోనీ ఐపీఎల్ లో కూడా ఓ జట్టును కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఈ మేరకు జట్టును కొనుగోలు చేసేందుకు సహకరించాలని బీసీసీఐకి దరఖాస్తు చేసినట్టు సమాచారం. బీసీసీఐ అంగీకరిస్తే ఈ విషయంపై స్పష్టత వచ్చినట్టే. చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా వ్యవహరించిన ధోనీకి, అందులో అనధికార భాగస్వామ్యం ఉంది. ఐసీసీ చీఫ్ శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ అవినీతితో చెన్నై సూపర్ కింగ్స్ ను ఐపీఎల్ రెండేళ్లు నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టోర్నీలో మరో రెండు జట్లను కొత్తగా తీసుకురావాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో ధోనీ ఒక జట్టును కొనుగోలు చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే ఇందులో శ్రీనివాసన్ కు వాటా ఉంటుందా? లేదా? లేకపోతే ధోనీని ముందుపెట్టి శ్రీనివాసనే జట్టును కొనుగోలు చేస్తున్నాడా? అనే వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే కోల్ కతాకు చెందిన ఆర్పీజీ సంజీవ్ గొయెంకాకు చెందిన గొయెంకా గ్రూప్ కూడా ఓ జట్టును కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే కోల్ కతా జట్టుకు షారూక్ యజమానిగా ఉన్న నేపథ్యంలో అందులో వాటా, లేదా ఇంకో జట్టును కొనుగోలు చేయడంపై దృష్టి పెట్టారు. దీంతో మరో జట్టు కొనుగోలు చేసేందుకే ఆయన ఆసక్తి చూపుతారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

More Telugu News