: ఈ పెళ్లి సమస్యను ఎలా పరిష్కరించాలి... తలలు పట్టుకున్న పోలీసులు

వాళ్లిద్దరూ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ ప్రేమ కాస్త పెళ్లి వరకు వెళ్లింది. విషయం పెద్దలకు తెలియడంతో వారు పెళ్లికి నిరాకరించారు. విషయం పోలీసుల వరకు వెళ్లింది. ఇద్దరూ మేజర్లే. అయినా ఏం చేయాలో పోలీసులకు కూడా అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. దీనికంతా కారణం ఒకటే. ప్రేమించుకుని, పెళ్లికి సిద్ధపడ్డ ఇద్దరూ అమ్మాయిలే. సృష్టి ధర్మానికి విరుద్ధంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్న శ్రీదేవి, అన్నామణిలది నల్గొండ జిల్లా. శ్రీదేవిది మిర్యాలగూడ కాగా, అన్నామణిది వేములపల్లి మండలం రావువారిగూడెం. వరుసకు ఇద్దరూ వదినామరదళ్లు అవుతారు. ఇద్దరూ పెళ్లికి సిద్ధపడగా, అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం సృష్టి విరుద్ధం అంటూ పెద్దలు నచ్చజెప్పారు. ఈ క్రమంలో ఇప్పటివరకు రెండు సార్లు వీరు పెళ్లి చేసుకోగా పెద్దలు విడదీశారు. ఈ నేపథ్యంలో, అన్నామణిని చూసేందుకు శ్రీదేవి మిర్యాలగూడకు వచ్చింది. సంగతి తెలుసుకున్న వారి బంధువులు దాడి చేసి, కొట్టారు. కొంతమంది గ్రామస్థులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయగా, పోలీసులు వచ్చి ఆరా తీశారు. అనంతరం అమ్మాయిలిద్దరినీ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా, వినని ఈ అమ్మాయిలు ఇద్దరం కలిసే ఉంటామని తెగేసి చెప్పారు. ఏం చేయాలో అర్థంకాని పోలీసులు ఇద్దరి సంతకాలు తీసుకుని పంపించివేశారు. ప్రస్తుతం ఈ అంశం స్థానికంగా చర్చనీయాంశం అయింది.

More Telugu News