: బాంబు పెట్టే పేల్చారు... అంగీకరించిన రష్యా, తీవ్ర ఆగ్రహం, విమానాలన్నీ రద్దు
ఈజిప్ట్ లోని షర్మ్ అల్ షేక్ నుంచి రష్యా బయలుదేరిన విమానాన్ని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు బాంబు పెట్టి పేల్చేశారని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంగీకరించారు. నిన్నటి వరకూ ఇది ఓ ప్రమాదమని భావించామని, బ్లాక్ బాక్స్ లో లభించిన సమాచారం మేరకు పేలుడు జరిగి విమానం కూలిందని వెల్లడించిన ఆయన, ఇక ఐఎస్ఐఎస్ క్రూరత్వాన్ని ఒక్క క్షణం కూడా సహించేది లేదని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన సెక్యూరిటీ చీఫ్ క్రెమ్లిన్ సూచనల మేరకు ఈజిప్టు వెళ్లే అన్ని విమానాలనూ రద్దు చేస్తున్నట్టు తెలిపారు.
ఆ వెంటనే ఐఎస్ఐఎస్ పై తీసుకోవాల్సిన తదుపరి చర్యల గురించి చర్చించేందుకు ఎఫ్ఎస్బీ సెక్యూరిటీ సర్వీసెస్ తో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. సైన్యాధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రమాదానికి నిజమైన కారణం ఇప్పుడే తెలిసిందని, ఇది అత్యంత తీవ్రమైన నేరమని రష్యా ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానించాయి. కాగా, ఈజిప్టులోని విదేశీయులను తక్షణం వెనక్కు రప్పించేందుకు బ్రిటన్ ప్రత్యేక విమానాలు నడుపుతోంది.