: బ్రెస్ట్ కేన్సర్ పై అపోహలు ... వాస్తవాలు!
భారతదేశంలోని నగరాలలోనే కాకుండా, గ్రామీణ ప్రాంతాలలో కూడా బ్రెస్ట్ కేన్సర్ (రొమ్ము కేన్సర్) బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. మహిళలకు సాధారణంగా వచ్చే వ్యాధులలో బ్రెస్ట్ కేన్సర్ రెండో స్థానంలో ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 2015 గణాంకాల ప్రకారం, ఈ వ్యాధికి సంబంధించి సుమారు 1,55,000 కొత్త కేసులు నమోదయ్యే అవకాశముంది. వీరిలో 76,000 మంది మహిళలు ఈ వ్యాధి బారిన పడి మరణించే అవకాశమున్నట్లు ఆ గణాంకాల ద్వారా వెల్లడైంది.
30-40 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలలో ఈ వ్యాధి పెరుగుతుండటం ఆవేదన కల్గిస్తోందని లండన్ లోని రాయల్ మార్స్ డెన్ ఆసుపత్రి లోని బ్రెస్ట్ సర్వీసెస్(సర్జికల్ ఆంకాలజీ) విభాగానికి చెందిన వైద్యులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా బ్రెస్ట్ కేన్సర్ వ్యాధిపై అపోహలను వారు ప్రస్తావించారు. కుటుంబంలో ఎవరికైనా ఈ వ్యాధి ఉంటే మనకు సంక్రమిస్తుందనుకోవడం, చిన్న వయస్సు మహిళలకు ఈ వ్యాధి రాదనుకోవడం, బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తే, వక్షోజాల సైజు పెద్దవిగా ఉంటే, మహిళల చెస్ట్ చిన్నగా ఉంటే, గర్భనిరోధక మాత్రలు వాడితే, బ్రా ధరిస్తే బ్రెస్ట్ కేన్సర్ వస్తుందనే అపోహలు వాస్తవం కాదని వైద్యులు చెప్పారు. పురుషులకు రోమ్ము కేన్సర్ రాదనే అపోహ కొందరిలో వుంది. ఇది కూడా వాస్తవం కాదు. బ్రెస్ట్ కేన్సర్ రోగుల్లో ఒక శాతం పురుషులు కూడా వుంటున్నారు.