: ‘రిలయన్స్’ అధినేతకు అక్కడ ప్రత్యేకమైన గది లేదు!

ఆ ఆఫీసులో ఏ ఒక్క అధికారికి ప్రత్యేకమైన ఛాంబర్ అంటూ లేదు. అంతెందుకు, చివరకు ఆ సంస్థ చైర్మన్ కు కూడా అక్కడ ఛాంబర్ లేదు. కనీసం గ్లాస్ డోర్లు కూడా లేవంటే నమ్ముతారా?... కానీ, నమ్మాల్సిందే. ఎందుకంటే, రిలయన్స్ సంస్థ చైర్మన్ ముఖేష్ అంబానీ ఆఫీసే ఇందుకు నిదర్శనం కాబట్టి! నవీ ముంబయిలోని రిలయన్స్ కార్పొరేట్ పార్క్ లోని 7వ అంతస్తులో జియో సంస్థ కార్యాలయం ఉంది. దీనిని 'పిటి 22 బిల్డింగ్' అని పిలుస్తారు. ఈ సంస్థ కింద టాప్ ఎగ్జిక్యూటివ్స్ నేతృత్వంలో 17,500 మంది ఫుల్ టైమ్ టీమ్ పనిచేస్తోంది. వాళ్లందరూ కలిసి ఒకే చోట కూర్చుని పని చేస్తున్నారు. ఉడ్- ప్యానెల్ తో ఉన్న ఈ గదులలో కనీసం గ్లాసు డోర్లు కూడా లేవు. చివరకు, రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ కూడా వారితోపాటు కలిసి కూర్చోవడం విశేషం. అంబానీకి ఎటువంటి ప్రత్యేకమైన గది కూడా ఈ ఆఫీసులో లేదు. టాప్ 70 లీడర్లు ఉన్న ఈ టీమ్ లో ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ, కూతురు ఇషా అంబానీ, ఆయన అసోసియేట్ మనోజ్ మోదీలు ఉన్నారు. సాధారణ ఉద్యోగులలా తమ సంస్థ అధిపతి, అధికారులు ఎటువంటి ప్రత్యేకమైన గదులు లేకుండా తమతో పాటే కలిసి కూర్చోవడంపై తోటి ఉద్యోగులు ఆనందంతో పాటు ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తున్నారు. కాగా, స్మార్ట్ ఫోన్లపై అత్యంత వేగవంతంగా సమాచారాన్ని అందించేందుకు రిలయన్స్ జియో సంస్థ సంసిద్ధమైన విషయం తెలిసిందే!.

More Telugu News